అక్షరటుడే, ఎల్లారెడ్డి: దేశానికి అన్నం పెట్టేది అన్నదాతలేనని.. అలాంటి రైతులను రుణాల వసూలు పేరుతో మానసికంగా వేధించడం దారుణమని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. లింగంపేటలోని కోఆపరేటివ్ బ్యాంక్ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. రుణాల వసూలు పేరిట అన్నదాతలను వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. బీఆర్‌ఎస్ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. బ్యాంక్ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, ఎర్రజెండాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు దివిటి రమేశ్, ముదాం సాయిలు, మనోహర్, నరేశ్, బండి నర్సింలు, రవీందర్ నాయక్, గన్ను నాయక్, ఉమ్లా, రమేశ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.