అక్షరటుడే, కామారెడ్డి: వానాకాలం పంటసాగుకు సంబంధించి అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని.. ఎక్కడా కొరత లేదని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శుక్రవారం భిక్కనూరు మండలంలోని విత్తన పంపిణీ కేంద్రాలను, పెస్టిసైడ్స్ దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మితో కలిసి తనిఖీ చేశారు. ముందుగా పీఏసీఎస్ స్టాక్ పాయింట్, రైతువేదికలో పర్మిట్ ఇష్యూ, బిల్ జనరేషన్ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు 60 శాతం సబ్సిడీపై జీలుగ(పచ్చిరొట్ట) విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అనంతరం సీడ్స్ దుకాణాలను తనిఖీ చేశారు. పత్తి, వరి విత్తనాల స్టాక్ ఎంత వచ్చింది..? ఎలా పంపిణీ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. నకిలీ, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.