అక్షరటుడే, ఇందూరు: పసుపు రైతులు తనను ఆశీర్వదించడం అదృష్టంగా భావిస్తున్నానని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్‌ కోసం డిపాజిట్‌ ఫీజును రైతులే చెల్లించారని.. వారికి ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నిజామాబాద్‌ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి వెళ్లి నామినేషన్‌ వేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతుకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్మూర్‌ను సీడ్‌ హబ్‌గా మారుస్తానని పేర్కొన్నారు. మామిడి, చెరుకు, వరి పంటలు సాగుచేసే రైతుల అభవృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. మార్కెటింగ్‌ సదుపాయాలు, మద్దతు ధర కోసం కృషి చేస్తామని తెలిపారు. అలాగే గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పారు.