అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీల కోసం ఏర్పాటు చేసిన వైద్యశాఖ బృందాలు ఓవైపు జిల్లా అంతటా జల్లెడపట్టాయి. కానీ, నిజామాబాద్ నగరంలో మాత్రం ఇప్పటివరకు ఏ ఒక్క ఆస్పత్రిలో తనిఖీలు చేయలేదు. కేవలం ఐఎంఏ ఇచ్చిన నివేదికను యథావిధిగా ప్రభుత్వానికి పంపాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ అంశం వైద్యవర్గాల్లో చర్చకు దారితీసింది. నగరంలోని పలు ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోగా.. ముఖ్యంగా కొందరు కనీస అర్హతలు లేకుండానే వైద్యం చేస్తున్నారు. మల్టీ స్పెషాలిటీ బోర్డులు ఏర్పాటు చేసి స్థాయికి మించి వైద్యం అందించి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ విషయాన్ని కొందరు క్వాలిఫైడ్ వైద్యులు సైతం తప్పుపడుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో తనిఖీలు చేయాలని ఆదేశించింది. దీంతో వైద్యశాఖ అధికారులు కొద్ది రోజులుగా ఆర్మూర్, బోధన్‌తో పాటు అన్ని చోట్లా ప్రైవేట్ ఆస్పత్రులు, ఆర్‌ఎంపీ, పీఎంపీ క్లినిక్‌లు తనిఖీ చేశారు.
ఇక్కడ మాత్రం ఎందుకిలా..?
వాస్తవానికి నిజామాబాద్ నగరంలోనే సింహభాగం ఆస్పత్రులున్నాయి. పలు ఇళ్లను హాస్పిటల్స్‌గా మార్చారు. వైద్యులు కానివారు సైతం మల్టీ స్పెషాలిటీ సేవల పేరిట ఆస్పత్రులను నెలకొల్పారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు 50 శాతం చొప్పున కమీషన్లు ఇచ్చి పేద రోగుల నుంచి ముక్కుపిండి మరీ అధిక ఫీజులు దోచుకుంటున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్య శాఖ వద్ద అనేక ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వ సూచనలతో పకడ్బందీగా తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. ఎలాంటి తనిఖీలు చేయకుండానే ఐఎంఏ నివేదికతో మమ అనిపించే యోచనలో ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆస్పత్రుల్లో క్షేత్రస్థాయి తనిఖీల కోసం 20 బృందాలను ఏర్పాటు చేయగా.. ఎవరూ కూడా తనిఖీలకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలివ్వడం ఇందుకు నిదర్శనం.