అక్షరటుడే, బోధన్: కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను ఆ పార్టీ మరోసారి మోసం చేస్తోందన్నారు. బుధవారం బోధన్ నియోజకవర్గంలోని సాలూరా, కల్దుర్కి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ ఉపాధిహామీ డబ్బులు కూడా సరిగా ఇవ్వలేని అసమర్ధత ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. కూలీ డబ్బులు చెల్లించకపోతే సుదర్శన్‌రెడ్డి ఇంటి ఎదుట ధర్నా చేస్తానన్నారు. దేశంలో యూసీసీ, త్రిబుల్ తలాక్, ఎన్‌ఆర్సీ లాంటి వాటితో ముస్లిం మహిళలకు మేలు చేకూరుతుందన్నారు. దేశభద్రత, ధర్మరక్షణ కోసం మళ్లీ మోదీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి, మోహన్ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.