అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్‌ వైపు నిలబడ్డారని ఎంపీ అభ్యర్థి జీవన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో ఎన్నికల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం తాను గెలవగానే నిజామాబాద్‌ను స్మార్ట్‌ సిటీ చేస్తానని పునరుద్ఘాటించారు. అన్ని అర్హతలు ఉన్నా.. ఐదేళ్లుగా బీజేపీ ఎంపీ నిర్లక్ష్యం చేశారన్నారు. కనీసం కేంద్రంతో మాట్లాడి నగరాభివృద్ధికి ఏమాత్రం తోడ్పడలేదని విమర్శించారు. అలాగే షుగర్‌ ఫ్యాక్టరీలు రాష్ట్రం పరిధిలో ఉన్నాయని నిర్లక్ష్యం చేశారని.. ఇటీవల అమిత్‌ షా ఫ్యాక్టరీలను సహకార సంఘంతో నడుపుతామనడం తగదన్నారు. తమ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి, నాయకులు రాజేశ్వరరావు, సునీల్‌ రెడ్డి, ఆకుల లలిత పాల్గొన్నారు.