అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నగరంలోని కోటగల్లి శంకర్‌భవన్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు హెచ్‌ఎంకు ఫిర్యాదు చేశారు. గత మూడ్రోజులుగా తినే అన్నంలో పురుగులు వస్తున్నాయని, నిర్వాహకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పిల్లల తల్లిదండ్రులు హెచ్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 600 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. పలువురు హాస్టల్‌ విద్యార్థులు సైతం ఇదే పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. అన్నంలో పురుగులు రావడంపై విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేసినప్పటికీ.. పాఠశాల సిబ్బంది మాత్రం గోప్యత పాటిస్తున్నారు. అసలే వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అధికారులు స్పందించి తిరిగి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.