అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిజామాబాద్‌ డైట్‌ కళాశాలలో విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. డైట్‌ కళాశాలలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉర్దూ ఉపాధ్యాయుడు తమను వేధింపులకు గురిచేస్తున్నట్లు పలువురు విద్యార్థినులు కొద్దిరోజులుగా ఆరోపిస్తున్నారు. కాగా.. తాజాగా ఓ విద్యార్థిని ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆయన ఈ విషయాన్ని డీఈవో దుర్గాప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎంఈవో రామారావును విచారణాధికారిగా నియమించారు. ప్రస్తుతం వేధింపుల వ్యవహారంపై విచారణ జరుగుతోంది. మరోవైపు వేధింపులు తాళలేకనే ఫిర్యాదు చేసిన విద్యార్థిని డైట్‌ కళాశాల నుంచి వెళ్లిపోయి ప్రైవేటు కళాశాలలో అడ్మిషన్‌ తీసుకున్నట్లు తెలిసింది.

ఆదినుంచి అతని తీరు వివాదాస్పదమే..

ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఉపాధ్యాయుడి తీరు మొదటి నుంచి వివాదస్పదమేనని తెలుస్తోంది. డైట్‌ కళాశాలలో ఉర్దూ అధ్యాపక పోస్టు ఖాళీగా ఉండడంతో రెంజల్‌ మండలంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో పనిచేస్తున్న ఈయన్ను డిప్యుటేషన్‌పై కొనసాగిస్తున్నారు. మొత్తం విభాగంపై తన పెత్తనం చలాయిస్తున్న సదరు ఉపాధ్యాయుడు విద్యార్థినులను వేధింపులకు గురి చేస్తున్నట్లు బయటపడింది. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. తమకు ఫిర్యాదు అందిన విషయం వాస్తమేనని, విద్యాశాఖ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇతర వివరాలు తెలిపేందుకు ఆయన నిరాకరించారు.