- రంగారెడ్డి జిల్లాలో కులాంతర వివాహం చేస్తుందని అక్కని తమ్ముడు కారుతో ఢీ కొట్టి, కిరాతకంగా నరికి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
- ఇటలీలోని ఒక పాకిస్థానీ జంట తమ పద్దెనిమిదెళ్ల కూతురిని పరువు పేరుతో చంపేసింది.
అక్షరటుడే, వెబ్ డెస్క్: అన్ని తామై ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న పేగు బంధాన్ని పరువు పేరుతో కడతేర్చుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో కానిస్టేబుల్ నాగమణిని తన సోదరుడు పరమేష్ దారుణంగా హతమార్చడం లా అండ్ ఆర్డర్ కే సవాలుగా మారింది. వృత్తి కోసం ఏర్పడిన కులాన్ని, జీవన విధానంగా పరిగణింపే మతం కోసం ఏళ్ల తరబడి కొనసాగిన బంధుత్వాన్ని తృణప్రాయంగా తెచ్చుకున్నారు. 20 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చి త్రుటిలో తమ కంటిపాపలను కాలరాస్తున్నారు. ఇది కేవలం ఒక్క మన రాష్ట్రానికో.. దేశానికో పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 వేల మంది మహిళలు పరువు పేరుతో చంపబడుతున్నారు. ఈ మొత్తం పరువు హత్యల్లో సింహభాగం భారతదేశం, పాకిస్థాన్‌లలో చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.