అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం బారి నుంచి కాపాడేందుకు సీపీఆర్ ఎంతో ఉపయోగపడుతుందని డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ అన్నారు. సీపీఆర్ నిర్వహణ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారికి సీపీఆర్ ఆవశ్యకతపై శనివారం కలెక్టరేట్‌లో ‘పునర్జన్మ’ పేరుతో అవగాహన కల్పించారు. గుండెపోటుకు గురైన వారికి సీపీఆర్ ఎలా చేయాలని మాస్టర్ ట్రైనర్లు ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ఎవరైనా హార్ట్‌ఎటాక్‌కు గురయితే వెంటనే సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి వల్ల గుండెపోటు బారినపడే వారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో రసూల్ బీ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగూరావ్ పాల్గొన్నారు.