అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తమిళనాడులో సభ్యసమాజం తల దించుకునే ఘటన చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థినిపై ఉపాధ్యాయులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన వ్యవహారం మానవీయ నైతిక విలువలు, నమ్మకాలను ప్రశార్థకంగా మార్చుతోంది. కృష్ణగిరి సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక(13) గత నెల రోజులుగా బడికి రావడం లేదు. ప్రధానోపాధ్యాయుడు, సహచర విద్యార్థినులు ఇంటికి వెళ్లి ఆరా తీయగా.. తన కుమార్తె గర్భం దాల్చిందని, అబార్షన్ చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళుతున్నట్లు బాలిక తల్లి చెప్పడంతో నివ్వెరపోయారు. బాలికపై పాఠశాలలోనే ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ప్రధానోపాధ్యాయుడి సూచన మేరకు బాలిక తల్లిదండ్రులు బర్గూర్ ఆల్ ఉమన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఉపాధ్యాయుులైన పారూరైకు చెందిన చిన్నసామి(57), మత్తూర్కు చెందిన ఆరుముగం(45), మేలపట్టికి చెందిన ప్రకాశ్(37)ను డీఎస్పీ నేతృత్వంలోని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.