అక్షరటుడే, ఆర్మూర్: పట్టణ బీఆర్ఎస్ పార్టీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ మున్నాతో పాటు 15 మంది కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి వినయ్ రెడ్డి అధ్వర్యంలో సోమవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. గతంలో వీరు మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తదనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వినీత వర్గం మొదట కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అంతా భావించారు. కానీ.. అనూహ్యంగా అసమ్మతి తీర్మానం ప్రవేశపెట్టిన వర్గం నుంచి 16 మంది కౌన్సిలర్స్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం చర్చకు దారితీసింది. ఒకేసారి 16 మంది కౌన్సిలర్స్ చేరికతో ఆర్మూర్ పట్టణంలో గులాబీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది.