అక్షరటుడే, వెబ్​డెస్క్​: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఓ వైపు ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం అవుతున్నా.. మరోవైపు ప్రభుత్వం కులగణన రీసర్వే చేపడతామని ప్రకటించడంతో అయోమయం నెలకొంది. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్​ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్​ వస్తుందని అంతా భావించారు. దానికి తగినట్లుగానే అధికారులు రిటర్నింగ్​ అధికారులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. అయితే కులగణనలో పాల్గొనని వారి కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు మళ్లీ సర్వే చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సర్వే అయ్యే వరకు ఎన్నికలు నిర్వహించబోమని మంత్రి పొన్నం సైతం స్పష్టం చేశారు. దీంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పరీక్షల సమయంలో సాధ్యమేనా..

మార్చి మొదటి వారం నుంచి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్​ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్​ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే అవకాశం లేదు. మరోవైపు రీసర్వే ఈ నెల 28 వరకు కొనసాగనుంది. అటు తర్వాత ప్రభుత్వం చర్చించి బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయాలి. దాని కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టి, గవర్నర్​తో ఆమోదింపజేయాలి. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్​ ప్రకటించాలి. దీనికి సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదనే చర్చ సర్వత్రా జరుగుతోంది. పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాతే ఎన్నికలపై ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉందని తెలుస్తోంది.