అక్షరటుడే, నిజామాబాద్: నకిలీ ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ జరిపిన ఉదంతంలో సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి దాదాపు రెండు నెలలు గడిచినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కేవలం మెమో జారీ చేసి చేతులు దులుపుకున్నారు. తప్పిదానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులే పరోక్షంగా వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో కొద్ది నెలల కిందట నకిలీ ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ జరిపిన ఉదంతం ‘అక్షరటుడే’ వెలుగులోకి తీసుకువచ్చింది. 160 గజాల స్థలానికి సంబంధించిన యజమాని చనిపోగా.. ఆమె పేరిట ఉన్న స్థలాన్ని నకిలీ ఆధార్ కార్డు సాయంతో ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం మరొకరికి బదలాయించారు. ఈ విషయంపై ‘అక్షరటుడే’ కథనం ప్రచురించగా.. ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. తప్పిదం జరిగినట్లు గుర్తించిన అధికారులు సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌కు తొలుత మెమో జారీ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఛార్జ్ మెమో ఇచ్చారు. ఇలా ఇప్పటికే రెండు నెలలపాటు కాలయాపన చేశారు. అనంతరం సదరు సబ్ రిజిస్ట్రార్ సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా వదిలేసినట్లు తెలుస్తోంది. నిజానికి జిల్లా రిజిస్ట్రార్ గతంలోనే చర్యలకు సిఫారసు చేసినా.. ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడం గమనార్హం. తప్పిదానికి పాల్పడిన సబ్‌రిజిస్ట్రార్‌ను కాపాడడం వెనుక ఆంతర్యమేమిటని శాఖలోని అధికారులు, సిబ్బంది చర్చించుకుంటున్నారు.