అక్షరటుడే, బాన్సువాడ: ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 59 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసంచేసి ఆరు క్వింటాళ్ల రాగి తీగ చోరీ చేసిన నిందితులను పట్టుకున్నామని తెలిపారు. రాగితీగ విలువ రూ.6 లక్షలు ఉంటుందన్నారు. సోమవారం నిజాంసాగర్ ఎస్సై సుధాకర్ నర్సింగ్‌రావుపల్లి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా నిందితులు అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించగా నేరం ఒప్పుకున్నారని చెప్పారు. నిందితులు మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన ఉబిడి లింగమయ్య అలియాస్ నాని, చిత్తారి రమేష్, తురపాటి ఏసు, దాసరి రాజు, తురపాటి అంబయ్యను అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు నిందితుల్లో కడమంచి పాపయ్య హత్య కేసులో జైలులో ఉండగా పోచయ్య ఆచూకీ దొరకలేదన్నారు. కేసును ఛేదించిన బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్, నిజాంసాగర్ ఎస్సై సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ సతీష్, కానిస్టేబుళ్లు వసి, శ్యామ్, రఘు, సంగమేశ్వర్, రాజు, బాలాజీలను ఎస్పీ సింధు శర్మ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.