అక్షరటుడే, వెబ్ డెస్క్: బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. బాన్సువాడ పట్టణంలో ప్రధాన రహదారికి ఇరువైపులా మురికి కాల్వలు నిండి రోడ్డుపై వర్షపు నీరు ప్రవహించింది. రోడ్లన్నీ జలమయమవ్వడంతో ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని రాంపూర్, దేశాయిపేట్, పోచారం, సోమేశ్వర్ తదితర గ్రామాల్లో రోడ్లపైకి నీళ్లు చేరాయి. అలాగే పిట్లం మండలం మద్దెల్ చెరు – బాన్సువాడ రహదారిపై భారీ వృక్షం విరిగి పడింది. దీంతో బాన్సువాడ – పిట్లం, బాన్సువాడ – బిచ్కుంద మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.