అక్షరటుడే, ఇందూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణనను వెంటనే చేపట్టాలని ఆ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం నగరంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించిన బీసీ సంక్షేమ సంఘం సదస్సులో ఆయన మాట్లాడారు. ముందుగా మాజీ మంత్రి డీఎస్‌కు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీలకు దూరమైనందునే ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాలేదన్నారు. బీసీ కులగణనతో జాతీయ సమగ్రతకు ప్రయోజనమే తప్ప వచ్చిన నష్టమేమీ లేదన్నారు. భాష, జాతులపరంగా లెక్కలు ఉన్నప్పుడు కులగణన ఎందుకు చేయవద్దని ప్రశ్నించారు. వెంటనే బీసీ కులగణన చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, నాయకులు ఆకుల ప్రసాద్, గంగాకిషన్, రవీందర్, దేవేందర్, వినోద్‌ కుమార్, శంకర్, శ్రీలత, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్‌ గణేష్‌ చారి, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్‌ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.