అక్షరటుడే, ఇందూరు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా(ఎన్‌డీసీసీబీ) చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం ఉదయం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో పదవి కోల్పోవాల్సి వచ్చింది. మార్చి 4న చైర్మన్ భాస్కర్‌రెడ్డిపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మాన లేఖను డీసీవోకు అందజేశారు. దీంతో మార్చి 21న అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై భాస్కర్‌రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. కానీ, బుధవారం ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో బుధవారం రాత్రి భాస్కర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ లేఖను డీసీవోకు వాట్సాప్ ద్వారా పంపారు. నిబంధనల ప్రకారం లేఖ ఇవ్వకపోవడంతో డీసీవో రాజీనామాను ఆమోదించలేదు. అయితే గురువారం ఉదయం జరిగిన అవిశ్వాస సమావేశంలో మొత్తం 20 మంది డైరెక్టర్లకు గాను.. 17 మంది సమావేశానికి హాజరయ్యారు. 16 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్లు డీసీవో శ్రీనివాస్ ప్రకటించారు. దీంతో మరో 11 నెలల గడువు ఉండగానే.. భాస్కర్‌రెడ్డి పదవి కోల్పోవాల్సి వచ్చింది. కాగా, వైస్‌చైర్మన్ రమేశ్‌రెడ్డికి ఇన్‌చార్జి చైర్మన్ బాధ్యతలను అప్పగించారు.