రాష్ట్రాన్ని రోహింగ్యాలకు అడ్డాగా మారుస్తారా?

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాష్ట్రాన్ని రోహింగ్యాలకు అడ్డాగా మార్చాలనుకుంటున్నా రని ధ్వజమెత్తారు. కేంద్రం అమలు చేసిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాన్ని రాష్ట్రంలో అమలుచేయబోమని ఉత్తమ్‌ అధికారికంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. కేవలం మైనార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్‌ నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలు రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆర్టికల్‌ 786 తీసుకువచ్చే యోచనలో ఉన్నారా? అని ప్రశ్నించారు. మంత్రి పదవిలో ఉండి ఉత్తమ్‌ ఈ తరహా వ్యాఖ్యలు ఎలా చేస్తారని, సత్వరమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై సీఎం రేవంత్‌ రెడ్డి సత్వరమే స్పందించాలన్నారు. గతంలో కేసీఆర్‌ బోధన్‌ను దొంగ పాస్‌పోర్టులకు అడ్డాగా మార్చారని.. తాజాగా ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి జగిత్యాలను పీఎఫ్‌ఐకి అడ్డాగా మార్చారని ఆరోపించారు. గడ్డం పెంచినంత మాత్రాన సెక్యులరిజం కాదని ఉత్తమ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసలైన సెక్యులర్‌ పార్టీ బీజేపీ మాత్రమేనని అర్వింద్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, లక్ష్మీనారాయణ, పంచరెడ్డి లింగం, స్రవంతి రెడ్డి, బంటు రాము తదితరులు పాల్గొన్నారు.