అక్షరటుడే, ఇందూరు: మరో నలబై రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండనున్నాయని, ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. నిజామాబాద్ అర్బన్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సునాయాసంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యమని గుర్తు చేశారు. గతంలో నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటామని, వచ్చే ఎన్నికల్లో మరింత రెట్టింపుతో పని చేయాలన్నారు. మైనారిటీల కోసం ఏం చేశారని కాంగ్రెస్ ప్రశ్నిస్తుందని, కేంద్రం అందజేసే ప్రతి పథకం మైనార్టీలకు అందుతుందన్నారు. ముఖ్యంగా రేషన్ షాపులో అందే బియ్యం, ఆయుష్మాన్ భారత్ ఎక్కువగా మైనారిటీలే వినియోగించుకుంటున్నారని తెలిపారు. తన హయాంలో మాధవ్ నగర్, అర్సపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్, కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చానని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 4 కోట్ల ఇళ్ళను కట్టించిందన్నారు. మైనార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మద్దతుగా నిలిచి తమ ఓటు వేసి వృథా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎప్పుడు చేస్తారని మహేష్ కుమార్ గౌడ్ అనడం హాస్యాస్పద మన్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, పార్లమెంట్ ప్రబారి వెంకట రమణి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, పోతనకర్ లక్ష్మీనారాయణ, కన్వీనర్ లింగం, గద్దె భూమన్న, ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు.