కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు!
అక్షరటుడే, బోధన్: ఇసుక అక్రమార్కులకు బోధన్ ప్రాంతం కామధేనువుగా మారింది. వీరికి రెవెన్యూ అధికారులు కొమ్ముకాస్తుండటంతో అక్రమ దందా మూడు, పూలు ఆరు కాయలుగా సాగుతోంది. బోధన్ మండలం సిద్ధాపూర్ లోని ఇసుక క్వారీ అక్రమాలకు నిలయంగా మారింది.
ఎన్నెన్నో అక్రమాలు
12 టన్నులకు DD చెల్లించి, 10 టైర్ టిప్పర్ లో 25 టన్నుల వరకు లోడు చేసి తరలిస్తున్నారు. వేబిల్లులు లేకుండా రూ.15,000 తీసుకొని, టిప్పర్లకు ఇసుకను ఓవర్ లోడ్ చేస్తున్నారు. దీనికి తోడు మరో కొత్త మోసానికి తెర లేపారు. టిప్పర్ యజమానులు ఇచ్చిన పాత DDలను MRO కార్యాలయం నుంచి తిరిగి టిప్పర్ యజమానులకే విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మల్కాపూర్ లో ఇసుక టిప్పర్ పట్టివేత
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ ను గురువారం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. మల్కాపూర్ పరిసర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. TS16UA2283 టిప్పర్ ను సీజ్ చేసి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
అధికారుల హస్తం!
సిద్దాపూర్ పాయింట్ వద్ద RI గంగాధర్ విధులు నిర్వహిస్తున్నారు. ఒక ప్రభుత్వ అధికారి విధుల్లో ఉన్నా కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందంటే.. సదరు అధికారి ప్రమేయం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. తహసీల్దారు కార్యాలయం నుంచి పాత DD బయటకు వస్తున్నాయంటే.. ఈ అక్రమ దందాలో సదరు తహసీల్దారు పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు లోతుగా విచారణ చేపడితే పూర్తి అక్రమాలు వెలుగులోకి రానున్నాయి.