రెవెన్యూ శాఖను మరింత బలోపేతం చేస్తాం

0

అక్షరటుడే, నిజామాబాద్: ప్రభుత్వ కార్యక్రమాల అమలులో క్రియాశీలక పాత్ర పోషిస్తూ నిరంతరం ప్రజల సేవలో నిమగ్నమై ఉండే రెవెన్యూ శాఖను మరింతగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 డైరీ, క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ శాసనసభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి, శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రితో పాటు సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చొరవ చూపుతామన్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు బదిలీ అయిన వీఆర్ఏలను సొంత జిల్లాకు తిరిగి పోస్టింగ్ కల్పించేలా తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇతర శాఖలలో నియమించబడిన వీఆర్వోలను తిరిగి రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేసేలా ముఖ్యమంత్రిని కోరుతామని చెప్పారు. ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకెళ్తుందని అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు రెవెన్యూ అసోసియేషన్ తోడ్పాటును అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్సీ.. వారికి తనవంతుగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రతినిధులు కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వేణుగోపాల్, శ్రీనివాసరావు, నాగార్జున, ప్రభు, శ్రీధర్, శశి తదితరులు పాల్గొన్నారు.