అక్షరటుడే, హైదరాబాద్: మహా కుంభ మేళాలో బాలీవుడ్ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకోవడం.. కిన్నెర అఖాడా మహామండలేశ్వరిగా నియమితువ్వడం.. ఆ వెంటనే బహిష్కరణకు గురవ్వడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కిన్నెర అఖాడా నుంచి మమతా కులకర్ణిని బహిష్కరిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు రిషి అజయ్ దాస్ ప్రకటించారు. మమతతో పాటు ఆమెను చేర్పించిన ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని కూడా తొలగించారు. మమతా కులకర్ణి చివరగా 2002లో విడుదలైన కభీ తుమ్ కభీ హమ్ సినిమాలో కనిపించారు.

కాగా, మండలేశ్వరిగా నియమితులవ్వడానికి తాను డబ్బు చెల్లించినట్లు వస్తున్న ఆరోపణలను నటి మమత ఖండించారు. ఆర్థిక కష్టాలే తనను సన్యాసం పైపు ప్రేరేపించాయని తెలిపారు. రూపాయి కూడా తన వద్ద లేవని, ఆ కష్టాలను ఎదుర్కోలేక సన్యాసం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు తెలిపారు. గత 23 ఏళ్లుగా తన మూడు అపార్ట్మెంట్లు మూసి ఉంచడంతో చెదలు పట్టి శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. తాను ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను చెప్పడానికి కూడా మాటలు రావడం లేదని మమతా కులకర్ణి కన్నీటి పర్యంతమయ్యారు.