అక్షరటుడే, వెబ్​డెస్క్​: కస్టమ్స్ అధికారులు వేసిన $1.4 బిలియన్ల పన్నుపై స్కోడా వోక్స్‌వ్యాగన్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్​ను ఈ నెల 17న బాంబే హైకోర్టు విచారించనున్నట్లు బార్ అండ్ బెంచ్ వెబ్సైట్ ప్రచురించింది. కంపెనీ తరఫు న్యాయవాది నరేశ్​ థాకర్, గోపాల్ ముంద్రా బుధవారం ధర్మాసనం ఎదుటకు ఈ డిస్ప్యూట్​ను తీసుకురాగా.. జస్టిస్ బీపీ కొలాబవాలా, జస్టిస్ ఫిర్దోష్ పూనివాలాతో కూడిన డివిజన్ బెంచ్ విచారణకు అంగీకరించింది. కస్టమ్స్ చట్టం కింద సెప్టెంబరు, 2024లో కస్టమ్స్ అధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ వోక్స్‌వ్యాగన్ కోర్టును ఆశ్రయించింది. స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్ ఇండియా.. ఆడి, స్కోడా, వోక్స్‌వ్యాగన్ కార్ల దిగుమతులను “పూర్తిగా నాక్డ్ డౌన్” యూనిట్లకు బదులుగా “విడి భాగాలు”గా తప్పుగా వర్గీకరించిందని, తద్వారా తక్కువ కస్టమ్స్ సుంకాలను చెల్లించిందనేది అధికారుల వాదన. కార్లను పూర్తి యూనిట్​గా తీసుకుంటే.. 30-35శాతం సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కానీ, వోక్స్‌వ్యాగన్ తన దిగుమతులను వేర్వేరు షిప్‌మెంట్‌లలో ప్రత్యేక భాగాలుగా చూపి, తద్వారా 5-15% మాత్రమే సుంకాలను చెల్లిస్తోందని అధికారులు చెబుతున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రకారం, వోక్స్‌వ్యాగన్ ఒక దశాబ్ద కాలంగా ఈ విధంగా దాదాపు పూర్తి చేసిన కార్లను దిగుమతి చేసుకుంటోంది. దేశంలో వోక్స్​వ్యాగన్ రెండు కార్ల తయారీ యూనిట్లను నెలకొల్పింది. ఒకటి చకన్(పుణె) కాగా.. రెండోది శేంద్ర(ఛత్రపతి శంభాజీనగర్)లో ఉన్నాయి.