అక్షరటుడే, ఆర్మూర్: కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు పసుపు బోర్డు అంశంపై అనవసరమైన అపోహలు సృష్టిస్తున్నారన్నారు. సాక్షాత్తు ప్రధాని మోదీ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. త్వరలోనే జిల్లాలో పసుపుబోర్డు కార్యాలయం ఏర్పాటవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్మూర్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో 66 చక్కెర కర్మాగారాలను తెరిపించిందని గుర్తుచేశారు. ఎన్డీఎస్‌ఎల్‌ను తెరిపించడంలో కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎప్పటికైనా కలిసే పార్టీలని.. అందుకు ఆర్మూర్ ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప యాక్షన్ మాత్రం లేదన్నారు. ఇందూరులో గురువారం జరిగే క్లస్టర్ విజయ సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరు కానున్నట్లు తెలిపారు.
త్వరలో రాకేశ్‌రెడ్డి ఆమరణ దీక్ష!
రాష్ట్ర ఆదాయాన్ని ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకే తరలిస్తున్నారని ఎంపీ విమర్శించారు. దీనిపై త్వరలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఛలో కొడంగల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని తెలిపారు. త్వరలో ఆయన ఆమరణ దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, సీనియర్ నాయకులు పల్లె గంగారెడ్డి, జీవీ నరసింహారెడ్డి, అందాపూర్ రాజేశ్, పోల్కం వేణు తదితరులు పాల్గొన్నారు.