అక్షరటుడే, హైదరాబాద్: అత్యుత్తమ పర్యాటక విధానాన్ని ఫిబ్రవరి 10వ తేదీలోగా సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దేశ, విదేశాల్లోని అత్యుత్తమ పాలసీని అధ్యయనం చేసి తెలంగాణ పర్యాటక పాలసీని రూపొందించాలని చెప్పారు.

టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించి పలు సూచనలు చేశారు. “దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా పాలసీ ఉండాలి. ప్రధానంగా టెంపుల్, ఎకో టూరిజంపై దృష్టి సారించాలి. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ఆస్కారం ఉన్న, అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలి. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలి” అని సీఎం సూచించారు.

సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే సమయంలో..

సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

గోదావరి, కృష్ణా పుష్కరాలకు..

ఆదిలాబాద్, వరంగల్, నాగార్జునసాగర్ లాంటి ప్రాంతాలలో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలి. వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

టూరిజం సర్క్యూట్‌..

హైదరాబాద్ మహానగరంలో హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఇందిరా పార్క్‌లను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలి. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా ఈ పాలసీని రూపొందించాలని చెప్పారు.