అక్షరటుడే, హైదరాబాద్: SLBC టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడం కష్టమేనని సింగరేణి క్వారీస్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. టన్నెల్ లోపల 11 కిలోమీటర్ల వరకు నీళ్లు ఆగిపోయి ఉన్నాయని తెలిపారు. రెండు సార్లు టన్నెల్ లోపల పరిస్థితులను పరిశీలించామన్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం కష్టమే, కానీ ప్రయత్నిస్తామని అన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి పలుమార్లు మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు రెండోరోజు నిర్విరామంగా కొనసాగిన సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యవేక్షించారు.

సహాయక చర్యల్లో ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీ కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏజెన్సీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని, ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలొద్దని అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.

సొరంగంలో వస్తున్న నీరు సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని, నిరంతరం నీటిని బయటకు తోడేయటంతో పాటు సొరంగంలోనికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. టన్నెల్‌లో కూలిన మట్టి దిబ్బలను తొలగించి ప్రమాదం జరిగిన చోటికి చేరుకునే ప్రత్నామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.