అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణలో నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల గౌరవం తగ్గకుండా, వాటి ప్రతిష్ఠను పెంచడానికి ఉపాధ్యాయులు, సిబ్బంది కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నాణ్యమైన విద్యను అందించే విషయాల్లో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన సోషలిస్టు నాయకుడు సత్యనారాయణ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి ఎంతో మంది గొప్పవారిని అందించిన మొగిలిగిద్ద పాఠశాల.. భవిష్యత్తులోనూ గొప్ప వారిని అందిస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని అన్నారు.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్..
150 ఏళ్లు పూర్తి చేసుకున్న మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ పాఠశాలకు ఏ అవసరం ఉన్నా సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మొగిలిగిద్ద గ్రామానికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)తో పాటు పాఠశాల నూతన భవనం, లైబ్రరీ నిర్మాణం కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు.
మౌలిక సదుపాయాలకు నిధులు
గ్రామానికి అవసరమైన సీసీ రోడ్లు, మైనారిటీ కమ్యూనిటీ హాలు నిర్మాణం, జూనియర్ కాలేజీలో మౌలిక సదుపాయాల కోసం నిధుల మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ప్రొ.కోదండరాం, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రొ.హరగోపాల్ తో పాటు స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.