అక్షరటుడే, వెబ్​డెస్క్​: రాష్ట్రంలో కులగణన సర్వే పారదర్శకంగా నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తెలిపారు. బీసీ సంఘాలు అడగక ముందే.. రాహుల్​ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం బీసీ గణన చేపట్టామన్నారు. బీసీ కుల గణనపై శనివారం ఆయన ప్రజాభవన్​లో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ కుల గణన చేపట్టడానికి సాహసం చేయలేదన్నారు. రూ.160 కోట్ల నిధులు కేటాయించి, 50 రోజుల పాటు రాష్ట్రంలో సర్వే చేపట్టామని వివరించారు. ఎన్యుమరేటర్లు సమగ్రంగా వివరాలు సేకరించి, దగ్గరుండి ఆన్​లైన్​లో డేటా ఎంట్రీ చేయించారన్నారు. ఎన్యుమరేటర్లు సేకరించిన వివరాలు జాగ్రత్తగా భద్రపరిచినట్లు వెల్లడించారు. గతంలో కేసీఆర్​ సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయట పెట్టలేదని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ వివరాలు వినియోగించుకున్నారని ఆరోపించారు. బీసీ కుల గణన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తనపై ఎంతో ఒత్తిడి ఉన్నా సర్వే నిర్వహించినట్లు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు సర్వేను తప్పు పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ నాయకులు సర్వే గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలన్నారు.