అక్షరటుడే, ఎల్లారెడ్డి: వసతి గృహాల్లోని విద్యార్థులకు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకునేందుకు నీరు లేక బకెట్లు పట్టుకొని బయటకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఎల్లారెడ్డి బీసీ బాలికల వసతి గృహంలో వారం రోజులుగా భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. చల్లని చలిలో బకెట్లు తీసుకొని ఎర్రమన్నుకుచ్చ ప్రాంతంలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. నీటి సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ట్యాంకర్ పంపినా నీరు సరిపోవడం లేదు. అధికారులు స్పందించి వసతి గృహంలో శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.