అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షల కాలయాపనకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కోరారు. కొంతమంది ఉద్యోగాలు పోవడంతో వాళ్లు ఆందోళన చేస్తున్నారన్నారు. నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు జీవో 29 ఇచ్చామని.. 53 పోస్టుల మెయిన్స్‌ పరీక్షలకు 31 వేల మందిని మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేశామని తెలిపారు. ప్రిలిమ్స్‌ పరీక్ష అయ్యాక విపక్షాలు ఆందోళన చేస్తున్నాయన్నారు. ఒక్కసారి నోటిఫికేషన్‌ ఇచ్చాక మధ్యంతరంగా మారిస్తే కోర్టులు ఊరుకుంటాయా..అలా మారిస్తే కోర్టులు రద్దు చేస్తాయని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో పోలీస్‌ డ్యూటీ మీట్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌ గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షలపై కీలక ప్రకటన చేశారు. ‘పరీక్షలకు సిద్ధం అవ్వండి 95 శాతం అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రతిపక్షాల మాయమాటలను నమ్మకండి’ అని అన్నారు. గ్రూప్‌ -1 అభ్యర్థులపై లాఠీఛార్జి చేయవద్దని.. కేసులు పెట్టవద్దని.. ఉదారంగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌ పోలీసులకు సూచనలు చేశారు. అభ్యర్థులు అపోహలను వీడాలని కోరారు.