అక్షరటుడే, వెబ్‌డెస్క్: స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇస్తానన్న రూ. వంద కోట్లను తిరస్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వానికి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవద్దని అదానీ గ్రూపుకు లేఖ రాశామని తెలిపారు. గొప్ప ఉద్దేశంతో స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించామని పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, అనుమతులు తెచ్చుకోవడానికి ఢిల్లీ పర్యటన చేస్తున్నామని తెలిపారు. గత కొన్ని రోజులుగా అదానీ అంశంపై దుమారం చెలరేగుతోందన్నారు. అదానీనే కాదు ఏ సంస్థలకైనా రాజ్యంగ బద్ధంగా పెట్టుబడులు పెట్టడానికి హక్కు ఉంటుందని రాహుల్ చెప్పారని అని గుర్తు చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఎంతోమంది నిధులు ఇచ్చారని వివరించారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులను సేకరించినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇస్తానన్న వంద కోట్లను స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనకు మంత్రివర్గ విస్తరణకు సంబంధం లేదని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో మంత్రులం కలిసి భేటీ అవుతామన్నారు. అలాగే అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, అనుమతులు తెచ్చుకోవడానికి ఢిల్లీ పర్యటన చేస్తున్నామని తెలిపారు. బీజేపీ ఖజానా నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. అదానీకి భూములు, కాంట్రాక్టులు బీఆర్‌ఎస్ వాళ్లే ఇచ్చారని తెలిపారు. వాళ్లలాగా కేసులు ఎత్తివేయించుకోవాడినికో, పైరవీలు చేయడానికో, అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వకుండా ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీ వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు.