అక్షరటుడే ఇందూరు: భరతమాతను జగద్గురు స్థానంలో నిలబెట్టడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన లక్ష్యమని సహ ప్రాంత ప్రచారక్ ప్రభు కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం నగర పథ సంచాలక్ అనంతరం ప్రభుత్వ ఐటీఐ కళాశాల మైదానంలో విద్యార్థి శిబిర సార్వజనికోత్సవం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభు కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచానికి జ్ఞానం, సంస్కృతి ఇచ్చిన భారతదేశ కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందన్నారు. హిందువుల సంఘటితం కోసం నిర్విరామంగా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఇప్పటికే ఆర్ఎస్ఎస్ గురించి చర్చ మొదలైందని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కోట్ల మందిని ఎలా సంపాదించారో రీసెర్చ్ జరుగుతుందన్నారు. 1925కు ముందు హిందూ పదం అనాలంటేనే ఆలోచించేవారని, ప్రస్తుతం మార్పు వచ్చిందని గుర్తు చేశారు. దేశ మొదటి ప్రధాని ‘నన్ను గాడిద అనండి.. కానీ హిందూ అనొద్దు’ అని అన్నారని గుర్తు చేశారు. అంటే హిందువులు అనడానికి కూడా జంకే పరిస్థితి అప్పట్లో ఉందన్నారు. అలాగే సమాజంలో కొందరు మనతో స్నేహం చేస్తూనే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల పేర్లతో హిందువుల ఐక్యాన్ని విచ్చిన్నం చేసే కుట్ర పన్నుతున్నారన్నారు. ప్రధానంగా లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, పాపులేషన్ జిహాద్ పేర్లతో హిందువులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మతమార్పిడుల కోసం మరో వర్గం పనిచేస్తుందన్నారు. అనంతరం రిటైర్డ్ రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ గజవాడ హనుమంతరావు మాట్లాడారు. అంతకుముందు కాషాయ ధ్వజారోహణ ప్రక్రియ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో కళాశాల శిబిర సర్వాధికారి గజానన్, విభాగ్ సంఘచాలక్ ప్రతాప్, నగర ప్రచారక్ సత్యం తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
విద్యార్థులు ప్రదర్శించిన దండ ప్రదర్శన, ఘోష్ ప్రదర్శన, యోగాసనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కవాతులో ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తాతో పాటు పలువురు ప్రముఖులు స్వయంసేవకులు పాల్గొన్నారు.