అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి తీవ్రతకు ప్రజలు ఉదయం బయట అడుగుపెట్టాలంటేనే జంకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తెల్లవారుజామునే ఆయా పనులకు వెళ్లేవారు చలి మంటలతో సేద తీరుతున్నారు. అత్యల్పంగా కామారెడ్డి జిల్లా మద్నూర్, నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవితల్లి, గాంధారిలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. జుక్కల్ లో 10.9, కామారెడ్డి జిల్లా కేంద్రంలో 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో 10.9, నిజామాబాద్ ఉత్తర మండలం గూపన్ పల్లిలో 11, దక్షిణ మండలంలో 12.1 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది.