అక్షరటుడే, కామారెడ్డి: కొత్త ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులందరూ సమష్టి కృషితో పని చేసి జిల్లాకు మంచిపేరు తేవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో నూతన సంవత్సర సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు. గతేడాది జిల్లాలో సత్ఫలితాలు సాధించామని, అదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ఖరీఫ్ లో రూ. వెయ్యి కోట్లతో ధాన్యం సేకరించి రాష్ట్రంలోనే రెండో స్థానం నిలిచామని, రబీలో మొదటి స్థానంలో నిలవాలని పేర్కొన్నారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు కలెక్టర్, అదనపు కలెక్టర్లకు నోట్ పుస్తకాలు, పెన్నులు, బ్లాంకెట్లు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, సీపీవో రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, డీటీవో శ్రీనివాస్ రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.