అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: బోధన్‌ పట్టణంలో ఉన్న ఎడపల్లి మహాత్మాబాపూలే పాఠశాలలో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు గురువారం రాత్రి బస చేశారు. పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన విద్యార్థులకు కొనసాగుతున్న స్టడీ అవర్స్‌ ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ జైపాల్‌తో అడిగి విద్యార్థుల దినచర్యపై వివరాలు తెలుసుకున్నారు. పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌లో నిల్వ ఉంచిన సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే కలెక్టర్‌ నిద్రించారు. కలెక్టర్‌ వెంట బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, ఆర్‌సీఓ సత్యనాథ్‌ రెడ్డి, తహసీల్దార్‌ విఠల్‌ తదితరులున్నారు.