అక్షరటుడే, హైదరాబాద్: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారాయి రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల తీరు. ప్రతియేటా లక్షల్లో విద్యార్థులు ఇంజినీరింగ్ పట్టా అందుకొని బయటకు వస్తున్నారు.. కానీ వారిలో తొంభై శాతం మందికి సంబంధిత సబ్జెక్టుపై పూర్తి పట్టు ఉండడం లేదు. కనీసం ఒక్కరైనా కొత్త ఆవిష్కరణలు చేసింది లేదు.. పేటెంట్ రైట్స్ పొందింది లేదు. వీరికి నైపుణ్యాలు అందించడంలో, వసతులు కల్పించడంలో చొరవ చూపని యాజమాన్యాలు.. ఫీజు పెంపుపై మాత్రమే తమ ధ్యాస కనబరుస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు సవరించాలని కోరుతూ తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎస్ఆర్సీకి)కి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. మొత్తం 157 కాలేజీలు ప్రతిపాదనలతో కూడిన దరఖాస్తులు అందించాయి.

భారీగా ఫీజుల పెంపు..

టాప్ 10 కాలేజీల్లో ఒక్కటైన చైతన్య భారతి ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్(సీబీఐటీ) ప్రస్తుతం రూ.1.65 లక్షలున్న ఫీజును రూ.2.84 లక్షలకు పెంచాలని కోరినట్లు తెలిసింది. వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీస్(వీఎస్ఆర్ వీజేఐ ఈటీ) ప్రస్తుతం ఉన్న రూ.1.35 లక్షల ఫీజును రూ.2.84 లక్షలకు పెంచాలంటూ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. టాప్ 15 ఇంజినీరింగ్ కాలేజీలు రూ.2 లక్షల ఫీజు వసూలు చేసేందుకు అనుమతివ్వాలని కోరాయి. మిగతావి రూ. 1.50 లక్షల ఫీజు ఉండాలంటున్నాయి.

25న కాలేజీల వారీగా రివ్యూ

ఇంజినీరింగ్ కాలేజీల నుంచి ఫీజుల సవరణపై ప్రతిపాదనలు స్వీకరించిన తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ.. ఈ నెల 25 నుంచి కాలేజీల వారీగా సమీక్షించనుంది. 2022 – 25 సంవత్సరానికి గాను 176 కాలేజీలు ఫీజుల సవరణకు దరఖాస్తులు చేసుకోగా.. రాబోయే మూడేళ్లకు గాను 157 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి.

నైపుణ్యాలేవీ..?

రాష్ట్రంలో 388 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. కానీ ఏ కాలేజీ కూడా తమ విద్యార్థులకు పూర్తిస్థాయి సబ్జెక్టును అందించడం లేదు. నైపుణ్యాలు నేర్పడం లేదు. చదివినా, చదవకున్నా ఇంజినీరింగ్ పట్టా ఇచ్చి బయటకు పంపించేస్తున్నాయి. పాత ప్రాజెక్టులను కాపీ కొట్టి కొత్త వాటిగా చూపెట్టి మమ అనిపిస్తున్నాయి. ఏ ఒక్క స్టూడెంట్ అయినా ఒక యాప్ తయారు చేసింది లేదు. కొత్త ప్రాజెక్టు రూపొందించింది లేదు.

వసతుల కల్పన మృగ్యం

రూ. లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. కాలేజీల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించడం లేదు. పాతకాలంనాటి కంప్యూటర్లు, డొల్లగా మారిన కీబోర్డులు, డక్కిముక్కిలు తిన్న మౌస్​లు.. ఇదీ కాలేజీల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న కంప్యూటర్ల దుస్థితి.

హాజరు శాతం తక్కువే..

టాప్ మోస్ట్ కాలేజీలు అయినా విద్యార్థుల హాజరు శాతం నామమాత్రంగానే ఉంటోంది. తరగతి గదుల్లో కనీసం 20 శాతం అయినా విద్యార్థులు ఉండని పరిస్థితి కొనసాగుతోంది. సరైన ఫ్యాకల్టీ, సరైన వసతులు లేక విద్యార్థులు తరగతి గదుల్లో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు.