అక్షరటుడే, బాన్సువాడ: మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి వెంటే తామంతా ఉంటామని పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాసుల బాల్‌రాజ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బాన్సువాడ నుంచి స్థానికేతరులు ఆరుగురు ఎమ్మెల్యేలు అయ్యారని, ఏనుగు రవీందర్ రెడ్డి స్థానికేతరుడు అంటూ మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఫామ్ అందుకున్న ప్రతి ఒక్కరూ నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా కొనసాగుతారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని గుర్తు చేశారు. పార్టీలో గ్రూపులను విభజించేందుకే పోచారం వచ్చారని, క్రమశిక్షణతో పార్టీలో ఉండాలన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. 40 ఏళ్లుగా ఇక్కడి నిధులు ఎవరు దోచుకుంటున్నారో చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ ఉనికి కోల్పోతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరారని దుయ్యబటారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మంత్రి గణేశ్, పాత బాలు, కొత్తకొండ భాస్కర్, మాసాని శ్రీనివాసరెడ్డి, బస్వరాజ్, అంబర్ సింగ్, రహీం, కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.