అక్షరటుడే, ఇందూరు: కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ సూచించారు. మంగళవారం డిచ్‌పల్లిలోని కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంటరీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నఫ్రత్ చోడో.. నిజామాబాద్ జోడో నినాదంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ముందుకెళ్లాలని సూచించారు. వేదిక మీద ఉన్నా.. కింద ఉన్నా.. మనమంతా ఒక్కటేనని కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లే మనకు శత్రువులని.. మనలో మనం కాదన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. కాంగ్రెస్ లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయన్నారు. మేం మంత్రి పదవుల్లో ఉండడానికి కారణం కార్యకర్తల కృషేనన్నారు.
అర్హులైన రైతులకే రైతు భరోసా: పీసీసీ చీఫ్
పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ రైతు భరోసా అర్హులైన రైతులకే ఇస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసి చూపించిందని, కానీ.. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నామన్నారు. మంత్రులతో మాట్లాడి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఒకప్పుడు కవిత ఆస్తులు.. ప్రస్తుత ఆస్తుల లెక్క చెప్పాలని సవాల్ విసిరారు. కేటీఆర్‌పై చట్టప్రకారమే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. కేవలం 39 సీట్లు రావడంతో కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. బీజేపీ మతం పేరుతోనే కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఏడాది కాలంలో కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో మంత్రులు సంజయ్, కిషన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్, కేటీఆర్‌తో చర్చకు సిద్ధమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, డాక్టర్ సంజయ్‌కుమార్, లక్ష్మణ్, ఆయా కార్పొరేషన్ల ఛైర్మన్లు ఈరవత్రి అనిల్, అన్వేష్‌రెడ్డి, తాహెర్ బిన్ హందాన్, కాంగ్రెస్ ఆర్మూర్, బాల్కొండ ఇన్‌ఛార్జులు సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డి, నాయకులు నగేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.