అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 10 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఇటలీలోని మిలాన్ నుంచి డిల్లీ వచ్చిన విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేయగా.. ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా కన్పించడంతో వారి బ్యాగ్ లను స్కాన్ చేస్తే ఏమీ దొరకలేదు. దీంతో నిందితులను తనిఖీ చేస్తే.. ప్రత్యేకంగా తయారు చేసిన బెల్ట్ లు బయటపడ్డాయి. వాటిని పరిశీలిస్తే.. ఇద్దరి వద్ద కూడా 5 కిలోల చొప్పున వందల కొద్ది బంగారు నాణేలు ఉన్నాయి. ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా దేశంలోకి తీసుకొస్తున్న 10.092 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు నాణేల విలువ రూ.7.8 కోట్లపైనే ఉంటుందని భావిస్తున్నారు. నిందితులిద్దరూ కశ్మీర్ కు చెందినవారిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.