అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Population | దేశంలో జనాభా వృద్ధి రేటు తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో యువత(Youth) అధిక సంఖ్యలో ఉన్నారు. రానున్న రోజుల్లో యువత తగ్గిపోయి వృద్ధులు పెరిగే అవకాశం ఉంది. దీంతో దేశం ఆర్థిక, సామాజిక పర సమస్యలను భవిష్యత్‌లో ఎదుర్కోనుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదికను విడుదల చేసింది. దేశంలో జనాభా(Population) పెరుగుదల రేటు కొన్నేళ్లు తగ్గుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది. 1971లో 2.2శాతంగా ఉన్న వృద్ధిరేటు 2026 వరకు 0.90కు పడిపోనుందని అంచనా వేసింది. 2036 వరకు జనాభా వృద్ధి రేటు 0.58 శాతానికి పడిపోతుందని వివరించింది.
Population | పెళ్లి, పిల్లలు వద్దంటున్న యువత
దేశంలో గతంలో వివాహాలు(Marriages) తక్కువ వయసులోనే చేసుకునేవారు. ప్రస్తుతం వివాహాలు లేటుగా జరుగుతున్నాయి. చదువు, ఉద్యోగం, ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లిలు చేసుకోవాలని యువత భావిస్తోంది. అంతేగాకుండా పిల్లల్ని కనడంపై కూడా నేటితరం అంతగా దృష్టి పెట్టడం లేదు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే భావనలో ఎక్కువ మంది ఉన్నారు. దీంతో సంతానోత్పత్తి(Fertility rate) రేటు పడిపోతుంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో యువత పెళ్లి, పిల్లలు అంటే నో చెబుతున్నారు. జపాన్‌లో పెళ్లి చేసుకోడానికి ఇష్టపడటం లేదు. చైనాలో సైతం పిల్లల్ని కనడం లేదు. దీంతో ఆయా దేశాల్లో వృద్ధుల రేటు పెరిగి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మనదేశంలో కూడా ప్రస్తుత యువత పెళ్లి, పిల్లలపై ఆసక్తి చూపడం లేదు. మోడర్న్ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడుతున్నారు. దీంతో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలో జనాభా వృద్ధి రేటు కూడా పడిపోతోంది. భవిష్యత్‌లో వృద్ధుల జనాభా పెరుగుదలకు ఇది కారణం అవుతుంది. వృద్ధుల సంఖ్య పెరిగితే పని చేసేవారు తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీంతో ఇటీవల పలు రాష్ట్రాల ప్రభుత్వాలు పిల్లల్ని కనండి అంటూ ప్రజలకు సూచిస్తున్నాయి.