అక్షరటుడే, ఇందూరు: మధుమేహం ఒకప్పుడు వయస్సుపై బడిన వారికి మాత్రమే వచ్చేది. నేటి ఉరుకులుపరుగుల జీవితం, ఒతిళ్లు, నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకువడం ఇలా అనేక కారణాల వద్ద చిన్న వయస్సులోనూ వస్తోంది. ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. షుగర్‌ వ్యాధి మనిషిపై తీవ్ర ప్రభావం చూపిస్తూ ఆయుర్ధాయం తగ్గిస్తోంది. అయితే ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి.. దీని లక్షణాలు.. వ్యాధి రకాలు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే అంశాలపై ప్రపంచ ‘డయాబెటిస్‌ డే’ సందర్భంగా ‘అక్షరటుడే’ ప్రత్యేక కథనం..

జీవితం కాలం వేధించే జబ్బు

మధుమేహం అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ప్రతి సంవత్సరం లక్షల మంది దీనిబారిన పడుతున్నారు. రక్తంలోని చక్కెరలను శరీరం ప్రాసెస్‌ చేయలేనప్పుడు డయాబెటిస్‌ వస్తుంది. షుగర్‌ వ్యాధి ప్రభావం ఎక్కువ కావడం వల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటి జబ్బులు సంభవించే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో ప్రకారం.. గత 40 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం ఈ వ్యాధి వ్యాప్తి నాలుగు రెట్లు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు అంచనా. ఈ వ్యాధి వల్ల ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ.. ఉన్నవారిలో సగం మందికి దీని గురించి తెలియకపోవడం శోచనీయం. జీవనశైలిలో మార్పులతో చాలావరకు వ్యాధి ప్రభావం శరీరంపై పడకుండా తగ్గించుకోవచ్చు.

డయాబెటిస్‌కు కారణాలు

తిన్న ఆహారంలోని కార్బోహైడ్రేట్లను జీర్ణవ్యవస్థ చక్కెరలు(గ్లూకోజ్‌)గా విడగొడుతుంది. క్లోమ గ్రంధి ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ శక్తిని విడుదల చేయడానికి ఈ గ్లూకోస్‌ను గ్రహించాలని శరీర కణాలను ఆదేశిస్తుంది. శరీరంలోని ఇన్సులిన్‌ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు డయాబెటిస్‌ సంభవిస్తుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తి లేకపోవడంతో శరీరంలో చెక్కర నిండి డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

డయాబెటిస్‌లో రకాలు..

మధుమేహం పలు రకాలుగా ఉంది. ఇందులో ముఖ్యమైనవి టైప్‌ -1 డయాబెటిస్‌, టైప్‌ -2 డయాబెటిస్‌.

  • క్లోమగ్రంధి నుంచి ఇన్సులిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి ఆగిపోతే రక్తంలో చక్కెర పేరుకుపోతుంది. ఇలా వచ్చేదాన్ని టైప్‌-1 డయాబెటిస్‌ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు కూడా తెలియలేదు. ప్రస్తుతం మధుమేహం ఉన్న వారిలో దాదాపు 10శాతం మందికి టైప్‌-1 ఉంటుంది.
  • టైప్‌ -2 డయాబెటిస్‌ అంటే క్లోమగ్రంధి తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. మధ్య వయస్సు, వృద్ధాప్యంలో సాధారణంగా ఇలా జరుగుతుంది. అయితే అధిక బరువు, ఎక్కువగా కూర్చుని పని చేయడం, కనీస శారీరక శ్రమ చేయకపోవడం వల్ల ఎక్కువగా యువతలో వస్తుంది. అలాగే గర్భంతో ఉన్నప్పుడు కడుపులోని బిడ్డకు తల్లికి సరిపడా ఇన్సులిన్‌ను శరీరం ఉత్పత్తి చేయలేకపోతే కొందరు గర్బిణులు గర్భస్థ డయాబెటిస్‌ను ఎదుర్కొంటారు. ఆరు నుంచి 16 శాతం మంది గర్బిణులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

మధుమేహం లక్షణాలు..

  • అధికంగా దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం.
  • బాగా అలసిపోవడం, బరువు తగ్గిపోవడం.
  • తరచుగా పుండ్లు కావడం, చూపు స్పష్టంగా లేకపోవడం.
  • గాయాలు, దెబ్బలు త్వరగా మానకపోవడం ప్రధాన లక్షణాలు.
  • టైప్‌ -1 డయాబెటిస్‌ లక్షణాలు చిన్నప్పుడే లేదా యుక్త వయసులో కనిపిస్తాయి. ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి.
  • సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారిలో, దక్షిణాసియా వారిలో నైతే 25 ఏళ్లు పైబడితే టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

నివారించే అవకాశం..

  • మధుమేహాన్ని పూర్తిగా నయం చేయలేం. కానీ నివారించే అవకాశం మాత్రం ఉంది.
  • చక్కెర స్థాయి ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్‌ ఆహారాలు, పానీయాలను తీసుకోకూడదు.
  • రిఫైండ్‌ షుగర్‌, రిఫైండ్‌ త్రుణ ధాన్యాలు, కూల్‌ డ్రింక్స్, స్వీట్లు చక్కెరను అదనంగా చేర్చుతాయి.
  • కూరగాయలు, పండ్లు, బీన్స్‌, తృణధాన్యాలు, ఆరోగ్యకర ఆయిల్‌, గింజలు, ఒమేగా-3 పుష్కలంగా ఉండే చేపల్ని తినవచ్చు.
  • విరామ సమయంలో కొంచెం కొంచెం ఎక్కువసార్లు తినవచ్చు. కడుపు నిండగానే తినడం ఆపాలి.
  • శారీరక వ్యాయామం తప్పనిసరి. నిత్యం ఉదయం, సాయంత్రం వేళలో నడక మంచిది.