అక్షరటుడే, వెబ్ డెస్క్: నగర శివారులోని మహీంద్రా కార్ల షోరూం నుంచి థార్ కారు అపహరణకు గురైంది. కాగా ఈ కేసులో ముగ్గురు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. డిచ్పల్లి సీఐ మల్లేష్ వివరాలు వెల్లడించారు. గత నెల 19న ధర్మారం శివారులోని మహీంద్రా షోరూం నుంచి గుర్తు తెలియని దొంగలు కొత్త థార్ వాహనాన్ని ఎత్తుకెళ్లారు. ఈ విషయమై షోరూం సీఈవో సాయినాథ్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నవీపేట్ కు చెందిన అబ్దుల్ సల్మాన్ ఖాన్, ఆర్మూర్ కి చెందిన వజాహత్ అలీ అలియాస్ వసిల్, అర్సపల్లికి చెందిన వహేద్ కలిసి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. చోరీకి గురైన కార్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ మల్లేష్ బృందాన్ని సీపీ, ఏసిపి అభినందించారు.