అక్షరటుడే, ఇందూరు: ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి పోలింగ్​ సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు పేర్కొన్నారు. నగరంలోని అంబేద్కర్​ భవన్​లో సిబ్బందికి మొదటి విడత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవోలు, ఏపీవోలను ఉద్దేశించి కలెక్టర్​ మాట్లాడుతూ ఎలాంటి సందేహాలున్నా శిక్షణ తరగతల్లో మాస్టర్​ట్రైనర్​ల ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఎక్కువ సమయం పడుతుందని ఓపికగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందన్నారు. పోలింగ్​ కేంద్రాల్లో సెల్​ఫోన్లకు అనుమతి లేదన్నారు. మాస్టర్ ట్రైనర్లు హన్మాండ్లు, వర్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఆర్డీవో రాజేంద్రకుమార్, రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల తహశీల్దార్లు, పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు పాల్గొన్నారు.