అక్షరటుడే, వెబ్ డెస్క్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో ఉదయం 4.50 గంటలకు మరణించారు. ఆయన పార్థివదేహాన్ని ఫిలింసిటీలోని నివాసానికి తరలించారు. ఆయన మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు.