అక్షరటుడే, వెబ్ డెస్క్: సినిమా టికెట్ ధరలు పెంచితే.. దాని వల్ల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఏపీలోని రాజమహేంద్రవరంలో మెగా పవర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. టికెట్ ధరల పెంపు అనేది డిమాండ్ అండ్ సప్లయ్ ఆధారంగా ఉంటుందన్నారు. దర్శకుడు శంకర్ తీసిన ‘జెంటిల్మెన్’ సినిమాను అప్పట్లో తాను బ్లాక్ లో టికెట్ కొని చూశానని గుర్తుచేసుకున్నారు. ‘అలా టికెట్ కొనడం వల్ల ఆ డబ్బు వేరేవాళ్లకు వెళ్తుంది. ప్రభుత్వం టికెట్ ధరలు పెంచడం వల్ల జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుంది’ అని వెల్లడించారు. సినీ పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని కొనసాగిస్తాం

సినిమా టికెట్ ధరల విషయంలో హీరోలతో పనిలేదని, నిర్మాతలు రావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టాలనేంత కిందిస్థాయి వ్యక్తులం కాదని, తాము ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

సినిమా స్టూడియోల ఏర్పాటుకు పిలుపు

‘ఆంధ్రప్రదేశ్ లో బలమైన యువత ఉంది. తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ దిల్ రాజుకు ఒక సూచన చేస్తున్నా.. ఇక్కడ యువతలో ఉన్న శక్తిని వినియోగించుకోవాలి. రాష్ట్రంలో పలుచోట్ల స్టంట్ స్కూల్స్ పెట్టాలని’ పవన్ కళ్యాణ్ సూచించారు. సినీ పరిశ్రమలో ఉన్న నిపుణులతో ఇక్కడి యువతలో నైపుణ్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి వారిని తీసుకొచ్చి స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే తదితర అంశాలపై తరగతులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కీరవాణి, తమన్ లాంటి వాళ్ల ద్వారా సంగీతంపై అవగాహన కల్పించాలని, స్టూడియోలు ఏర్పాటు చేయాలని కోరారు.