అక్షరటుడే, నిజామాబాద్: నగరంలో కొందరి పోకిరీ చేష్టలు రోజురోజుకీ హద్దుమీరుతున్నా యి. నకిలీ తుపాకీ(లైటర్ గన్)తో పలువురిని భయపెడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. శనివారం రాత్రి అయిదో టౌన్ పరిధిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న ముగ్గురు యువకులు కేంద్రీయ విద్యాలయం సమీపంలో చీకట్లో నకిలీ తుపాకీతో శబ్ధం చేస్తూ హల్చల్ చేశారు. ఈ ప్రాంతంలో ఉండే మినీ ట్యాంక్ బండ్ కు మహిళలు, యువతతో పాటు ఫ్యామిలీస్ నిత్యం సాయంత్రం వేళ సేద తీరేందుకు వస్తుంటారు. శనివారం రాత్రి నకిలీ గన్ తో ముగ్గురు యువకులు శభ్ధం చేయడంతో దారి వెంట వచ్చి వెళ్లేవారు భయానికి లోనయ్యారు. చివరకు మహిళా హోంగార్డు శబ్ధాన్ని గుర్తించి స్థానికుల సాయంతో ముగ్గురిని పట్టుకుంది. అనంతరం అయిదో టౌన్ లో అప్పగించగా.. విచారణ జరుపుతున్నట్లు సమాచారం. గంజాయి మత్తులో యువత వీటిని అడ్డుపెట్టుకొని పలువురిని భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదేక్రమంలో నేరాల వైపు మళ్లుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇకనైనా ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలి.