అక్షరటుడే, ఎల్లారెడ్డి: గాంధారి మండలంలో భారీగా నకిలీ నోట్లు వెలుగు చూశాయి. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపింది. మండలంలోని చద్మల్ తండాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని లక్ష్మమ్మ ఆలయంలో ప్రతి యేటా సంక్రాంతి సమయంలో 13, 14, 15 తేదీలలో మూడు రోజుల పాటు జాతర సాగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు హుండీలో కానుకలు చెల్లించుకుంటారు. హుండీ ఆదాయం లెక్కింపులో వచ్చిన నగదును తండా వాసులకు తక్కువ వడ్డీకి అప్పుగా ఇస్తారు. ఈసారి కూడా ఆలయ హుండీ దాదాపుగా 7.5 లక్షలు వచ్చినట్టుగా తెలిసింది. అయితే హుండీ లెక్కింపు సమయంలో అన్ని ఒరిజినల్ నోట్లే రాగా.. మరుసటి రోజు తండా వాసులకు అప్పుగా ఇచ్చే సమయంలో నకిలీ నోట్లు బయటపడ్డాయి. దాదాపు లక్షల్లో 500 రూపాయల నకిలీ నోట్లు వెలుగు చూడడంతో తండాలో ఆందోళన మొదలైంది. నకిలీ నోట్లు రావడంతో తండా వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. అయితే కావాలనే నకిలీ నోట్లను అప్పుగా ఇచ్చే డబ్బులో జమ చేసారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ముగ్గురు వ్యక్తుల మీద తండా వాసులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా సమాచారం. ఇటీవల బాన్సువాడ డివిజన్ పరిధిలో సుమారు రూ.60 లక్షల నకిలీ నోట్లు చలామణి చేయడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి.. నకిలీ నోట్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. నెల రోజులు కూడా గడవకముందే మళ్లీ నకిలీ నోట్ల చలామణి కలకలం రేపుతోంది. ఈ నకిలీ నోట్లు ఎక్కడినుంచి వచ్చాయి..? ఎవరు తీసుకువచ్చి చలామణి చేస్తున్నారనేది? పోలీసుల విచారణలో తేలనుంది.