అక్షరటుడే, ఎల్లారెడ్డి: పిడుగు పాటుతో ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ఓ రైతు మృతి చెందాడు. నాగిరెడ్డిపేట మండలం బొల్లారంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంద వెంకటి (25), తండ్రి మంద నాగభూషణం ఇద్దరు కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబెట్టారు. ఒకేసారి భారీ వర్షం కురవడంతో తండ్రి కొడుకులు చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో వెంకటి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి నాగభూషణంకు తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. వెంకటికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది.