అక్షరటుడే, నిజాంసాగర్: నాగమడుగు మత్తడి నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు గతంలో ప్రకటించిన విధంగా పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. నిజాంసాగర్ మండల పరిషత్​ కార్యాలయంలో గురువారం వడ్డేపల్లి, కోమలంచ గ్రామానికి చెందిన రైతులతో సబ్​ కలెక్టర్​ కిరణ్మయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం నాగమడుగు మత్తడి నిర్మాణంలో భాగంగా నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి శివారులో 10.24 ఎకరాలు, మహమ్మద్ నగర్ మండలం కోమలంచ శివారులో 10.04 ఎకరాల భూములు సేకరిస్తున్నట్లు తెలిపారు. గతంలో కలెక్టర్ తమకు హామీ ఇచ్చిన విధంగా ఎకరాకు రూ.17 లక్షలు ఒకేసారి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు ఆమెను కోరారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఈ సోలోమాన్, నిజాంసాగర్ తహశీల్దార్ భిక్షపతి, డిప్యూటీ తహశీల్దార్ నవీన్, ఆర్​ఐలు పండరి, సాయిబాబా, నాయకులు ప్రజా పండరి పాల్గొన్నారు.